తాజా వార్తలు

10/recent/ticker-posts

బాలికల భద్రతపై విజయవాడలో జిల్లా స్థాయి వర్క్‌షాప్


విజయవాడ, ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 21: పాఠశాలలు, హాస్టళ్లలో బాలికల భద్రతా మార్గదర్శకాలు మరియు సురక్షిత మౌలిక వసతులపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు.


ఇరిగేషన్ కాంపౌండ్‌లోని ఫార్మర్స్ ట్రైనింగ్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తాన బేగం అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్ ప్రదర్శనతో పాటు కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ మాట్లాడుతూ, బాలికల భద్రతతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల హాజరు శాతం పెంపు, డ్రాప్‌అవుట్ తగ్గింపు కోసం పాఠశాలలు కృషి చేస్తున్నాయని తెలిపారు.

సమగ్ర శిక్ష అదనపు ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమేష్ బాబు మాట్లాడుతూ, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా పాఠశాలల పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు.

విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ వాసవి మాట్లాడుతూ, బాలికలపై జరుగుతున్న వేధింపులను దృష్టిలో ఉంచుకుని పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. టీనేజ్ గర్భధారణలు పెరుగుతున్న నేపథ్యంలో బాల్య వివాహాలపై కట్టుదిట్టమైన చర్యలు అవసరమన్నారు.

క్రాఫ్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ తంబీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చైల్డ్ రైట్స్ వివరించగా, వై. జాన్సన్ బాల్య వివాహ చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం బాలికల భద్రత మార్గదర్శకాలు మరియు సురక్షిత మౌలిక వసతుల బుక్‌లెట్‌ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం. రాజేశ్వరరావు, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ భారతి, నోడల్ ఆఫీసర్ సాయి గీత, సీడీపీఓలు, ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, సూపర్వైజర్లు మరియు మిషన్ వాత్సల్య అధికారులు పాల్గొన్నారు.