ఏలూరు/దెందులూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 6: ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం సోమవరప్పాడు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి గ్రామంలోని పలు చెరువులను పరిశీలించారు.
గ్రామంలోని సోలా చెరువును పరిశీలించిన కలెక్టర్, ఆ ప్రాంత రైతులతో మాట్లాడి చెరువుల పరిస్థితి, అవసరమైన మరమ్మత్తులపై వివరాలు తెలుసుకున్నారు. చెరువుకు నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న గుర్రపుడెక్కను తొలగించాలని, చెరువు గట్లు పటిష్టం చేయాలని, పూడికతీత పనులు చేపట్టేలా వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
పెద్ద విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువస్తే పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలోని అన్ని చెరువులను సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారాల దిశగా మరమ్మత్తుల కోసం ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ దేవప్రకాష్, ఆర్డీఓ ఐ. కిషోర్, సాగునీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ సంఘాల ఛైర్మెన్లు పాల్గొన్నారు.


