తాజా వార్తలు

10/recent/ticker-posts

వర్షపు నీటి సంరక్షణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 06: జిల్లా వ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. దెందులూరు మండలం సోమవరప్పాడులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి నిర్వహించిన ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి నీటి చుక్కను సంరక్షించడం లక్ష్యంగా గ్రామ, మండలాల వారీగా చెరువులు, కాలువలు, ఫీడర్ చానెల్స్ గుర్తించి వాటి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తూడు, గుర్రపుడెక్క వంటి అడ్డంకులను తొలగించి, చెరువుల్లో పూడికతీత, పునర్నిర్మాణం, ఆక్రమణల తొలగింపు వంటి పనులకు ఈ నెల 15వ తేదీలోగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. అనంతరం 10 రోజుల్లో పరిపాలనా ఆమోదం ఇచ్చి, 70 రోజుల్లో పనులు పూర్తి చేసి జూలై 14లోగా బిల్లులు సమర్పించేలా ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు.

భూగర్భ జలమట్టాలను పెంచడం ప్రధాన లక్ష్యంగా వేసవిలో 6 మీటర్లు, వర్షాకాలం అనంతరం 3 మీటర్ల స్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతున్న ఉద్యానవన రైతులు తమ పొలాల్లో తప్పనిసరిగా ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వర్షపు చుక్కను నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచడం సాధ్యమవుతుందని తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో 44 సాగునీటి సంఘాలు, 4 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 209 చెరువులు ఉన్నాయని, ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని అన్ని చెరువులను నీటితో నింపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా ఇప్పటికే 15 వేల ఎకరాలకు సాగునీరు అందించామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు.