ఏలూరు/నూజివీడు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 6: రాష్ట్రంలో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా “నీటి భద్రత – సాగునీటి సంఘాలు బాధ్యత” పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు. నూజివీడు పట్టణంలోని పెద్ద చెరువు వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలతో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.
మంత్రి మాట్లాడుతూ ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, భూగర్భ జలాల స్థాయిని పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. నీటి వృథాను నివారించి సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో 4 మండలాల్లో 68 ఎంఐ ట్యాంకులు, 300 పంచాయతీరాజ్ ట్యాంకులు ఉన్నాయని, మొత్తం 25,947 ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు.
ఏప్రిల్ 6 నుండి జూలై 14 వరకు ఈ 100 రోజుల ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో కాలువల శుభ్రపరచడం, పూడికతీత, గట్ల బలోపేతం, లాక్స్ మరమ్మతులు వంటి పనులు చేపడతామని చెప్పారు. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు పనుల గుర్తింపు, 16 నుంచి 20 వరకు పరిపాలనా అనుమతులు, ఏప్రిల్ 21 నుంచి జూలై 9 వరకు పనుల అమలు, జూలై 10 నుంచి 14 వరకు తుది నివేదిక సమర్పణ జరుగుతుందని వివరించారు.
ప్రజల భాగస్వామ్యంతో పనులు వేగంగా, నాణ్యతగా పూర్తవుతాయని, కాలువలు, బోదుల ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జలవనరులు, అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, పశుసంవర్ధక, డ్వామా శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, వివిధ శాఖల అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



