ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాదు సూచించారు.
మంగళవారం నిర్వహించిన సామాజిక న్యాయం – సాధికారత సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అవి నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని స్పష్టం చేశారు.
అర్హులైన లబ్ధిదారులు ఈ పథకాలను పొందడంలో ఎదుర్కొనే న్యాయ సంబంధిత సమస్యలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు. పథకాల అమలులో లోపాలపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని అధికారులు తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల పనితీరు, పురోగతిపై వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి డా. సి.హెచ్. సూర్యచక్రవేణి, జిల్లా ఐసిడిఎస్ పిడి పి. శారద, డిఆర్డిఏ పిడి ఎం.యస్.యస్. వేణుగోపాల్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.



