ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: దళితులపై జరుగుతున్న వివక్షలు, దాడులను అరికట్టేందుకు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని స్ఫూర్తి భవన్‌లో తొర్లపాటి బాబు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, అత్యాచారాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు చట్టాలను సవరిస్తూ వారి భద్రతను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయని ఆరోపించారు. కార్మికుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు కుల వివక్ష కొనసాగుతుందని అన్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత రక్షణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, కార్పొరేట్ అనుకూల విధానాల కారణంగా పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని విమర్శించారు. కొద్దిమంది ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. పేదలు, సామాజికంగా వెనుకబడిన దళితుల సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్‌గా కూరాకుల బాబూరావును ఎన్నుకున్నారు. మొత్తం 13 మంది సభ్యులతో జిల్లా కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో గుమ్మడి లక్ష్మీనారాయణ, తాడిగడప జయరాజు, గొలిమే బాల యేసు, పులిపాకుల దుర్గారావు, కొండేటి రాంబాబు, కొల్లూరి సుధారాణి, ఉప్పులూరి లక్ష్మి, భవాని తదితరులు పాల్గొన్నారు.


