ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: మానవాళి రక్షణ కోసం శిలువపై ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు మహిమను ఘనపరిచేందుకు అందరూ ఆయన చూపిన ప్రేమ, త్యాగ మార్గంలో నడవాలని ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ పోలిమేర జయరావు మరియు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు.
ఏలూరు పరిసర ప్రాంతాల క్రైస్తవ సంఘాలు, దైవ సేవకులు, నాయకులు, విశ్వాసులు ఆధ్వర్యంలో శనివారం “రన్ ఫర్ జీసెస్” కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీని బిషప్ జయరావు, ఎమ్మెల్యే చంటి, బిషప్ డాక్టర్ జాన్ ఎస్.డి. రాజు, బిషప్ డాక్టర్ ఎం ఏలీషా రాజు, ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ర్యాలీ ఇండోర్ స్టేడియం వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా బిషప్ జయరావు మాట్లాడుతూ, త్యాగం ద్వారా సమాజానికి సేవ చేయవచ్చని, సాటి మనుషుల కోసం త్యాగం చేయడం ద్వారా క్రీస్తు ఇచ్చిన సందేశం ఎంతో గొప్పదని అన్నారు. ప్రభువు తన రక్తంతో పాపులను కడిగి లోక రక్షణ కోసం త్యాగం చేశారని వివరించారు.
ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటి అవగుణాలను తొలగించి మానవాళిని సన్మార్గంలో నడిపించేందుకే క్రీస్తు భూమిపై అవతరించారని చెప్పారు. ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ప్రపంచంలో యుద్ధాలు ఆగి శాంతి, సామరస్యాలు నెలకొనాలని ఆకాంక్షించారు.
ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, శాంతియుత జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, మనుషుల మధ్య స్నేహభావం మరింత బలపడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ బురదగుంట క్రాంతి రవికిరణ్, పెరికే వరప్రసాదరావు, ఆర్నేపల్లి తిరుపతి, హెన్రీ డొమినిక్, ఫాదర్ మైకేల్, పాస్టర్ పి. జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


