ఏలూరు,పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: ఉన్నత విద్య ప్రక్షాళన పేరుతో పారదర్శకతకు భంగం కలిగించే చర్యలను ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి. శివ కుమార్ హెచ్చరించారు. శనివారం ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని స్ఫూర్తి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉన్నత విద్యా మండలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. విద్యావేత్తలతో చర్చలు లేకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా చీకటి జీవోలు జారీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. దాదాపు 40 ఏళ్లుగా పారదర్శకంగా కొనసాగుతున్న వ్యవస్థను అకస్మాత్తుగా మార్చడం వెనుక ఉన్న ఉద్దేశ్యాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా జీవో ద్వారా ఉన్నత విద్యా కమిషనర్ (CHE)కు అన్ని అధికారాలు కేంద్రీకరించడం వల్ల పారదర్శకత దెబ్బతింటుందని శివకుమార్ పేర్కొన్నారు. ప్రైవేట్ కాలేజీల అనుమతులు, కోర్సుల ప్రారంభం, అడ్మిషన్ కౌన్సెలింగ్, ఫీజుల నియంత్రణ వంటి కీలక అంశాలను ఒకే అధికారికి అప్పగించడం వల్ల విద్యారంగం వ్యాపారంగా మారే ప్రమాదం ఉందన్నారు. పరీక్షలు, ప్రవేశాల ప్రక్రియలను వేరు చేయడం చట్టవిరుద్ధమని, విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు.
ఉన్నత విద్య ప్రక్షాళనపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రెడ్డి సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేసి, మంత్రివర్గంలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు. GO No.3ను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా నాయకులు సిద్ధు, టౌన్ నాయకులు హార్దిక్, మణికంఠ, కొయ్యలగూడెం మండల అధ్యక్ష కార్యదర్శులు దుర్గారావు, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.


