తాజా వార్తలు

10/recent/ticker-posts

కీలక ప్రగతి సూచికల్లో ఎన్‌టీఆర్ జిల్లా ముందంజ – ఏ+ గ్రేడ్ కైవసం


ఎన్‌టీఆర్ జిల్లా, ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 21: జిల్లా సమగ్రాభివృద్ధికి అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందని, దాని ఫలితంగా కీలక ప్రగతి సూచికల్లో ఎన్‌టీఆర్ జిల్లా రాష్ట్రంలో ముందంజలో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.


మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మొత్తం కీలక ప్రగతి సూచికలు (KPI)లో 90 స్కోరుతో జిల్లా ఏ+ గ్రేడ్ (అచీవర్స్)ను సాధించిందని వెల్లడించారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో జిల్లా రెండో స్థానంలో కొనసాగుతోందని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,05,135 కోట్ల జీడీడీపీ నమోదు కావడం విశేషమన్నారు. 12.91 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు.

తలసరి ఆదాయం 12.5 శాతం వృద్ధితో రూ.3,91,274కు చేరి, రాష్ట్రంలో ఉన్న ర్యాంకు మెరుగుపడిందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని, 100 శాతం సంతృప్తి లక్ష్యంగా “టీమ్ ఎన్‌టీఆర్” పనిచేస్తోందని పేర్కొన్నారు.

ప్రజలకు సత్వర సేవలు:
ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంపై దృష్టి సారించామని, ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై 93.56% సానుకూల స్పందన వచ్చినట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లపై 87.29% సంతృప్తి నమోదైందని చెప్పారు. ప్రజా రవాణా, విద్య, గృహ నిర్మాణం, విద్యుత్ సేవలు తదితర రంగాల్లో 80%కు పైగా సంతృప్తి స్థాయి నమోదైందన్నారు.

వైద్య సేవల్లో మెరుగుదల:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, 80%కు పైగా రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. క్యూఆర్ కోడ్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను ప్రవేశపెట్టి సేవలను మరింత మెరుగుపరుస్తున్నామని వెల్లడించారు.

రైతులకు అండగా చర్యలు:
పీఎం-కిసాన్ పథకం ద్వారా 1.18 లక్షల రైతు కుటుంబాలకు రూ.118.62 కోట్లు అందించామని తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తూ కిసాన్ డ్రోన్లు, యంత్ర పరికరాలను రాయితీపై అందిస్తున్నామని చెప్పారు. ప్రకృతి సేద్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

అలాగే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేస్తున్నామని, ఫిబ్రవరి నాటికి 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ తెలిపారు.