చింతలపూడి, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: పాత బస్టాండ్ మరియు బోయగూడెం ప్రాంతాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు “జై భీమ్” నినాదాలతో సభను ఉత్సాహభరితంగా మార్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాకుండా విద్యాభివృద్ధి, దళితుల సంక్షేమం, అన్ని వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, నేడు మనకు లభిస్తున్న స్వేచ్ఛ, సమాన హక్కులు అన్నీ ఆయన రచించిన రాజ్యాంగ ఫలితమని తెలిపారు.
అంబేద్కర్ ఆలోచనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు.


