ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన భారతీయుడిగా జన్మించడం దేశ ప్రజల అదృష్టమని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పేర్కొన్నారు.
డా. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను ప్రజలంతా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించి, దాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను అనుసరిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించాలన్నారు.
అంబేద్కర్ అందరివాడని, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమాన అవకాశాలు అందించాలని ఆయన ఆశయమని పేర్కొన్నారు. దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం అన్నీ సమానంగా అందాలనే ఆలోచనతో రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని కొనియాడారు.
అనంతరం నవాబ్‌పేట, ఇందిరా కాలనీ, చాటపర్రు రోడ్డు, ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


