ఏలూరు/ద్వారకాతిరుమల, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ద్వారకాతిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అతిథి గృహంలో ఆయన, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రతి మూడవ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు.
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) 2.0 కింద ద్వారకాతిరుమలలో గోశాల అనుసంధానంగా గోబర్ధన్ బయోగ్యాస్ ప్లాంటును విజయవంతంగా ప్రారంభించామని తెలిపారు. రోజుకు 1 టన్ను సామర్థ్యంతో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంటు ద్వారా రోజుకు సుమారు 40 ఘన మీటర్ల బయోగ్యాస్, గంటకు 8–10 యూనిట్ల విద్యుత్తు, అలాగే 700–800 కిలోల బయో స్లరీ ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఇది సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడటంతో పాటు, పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ వ్యర్థ నిర్వహణకు తోడ్పడుతుందని చెప్పారు.
“చెత్త నుండి సంపద” లక్ష్యంతో ఈ ప్రాజెక్టు సుస్థిర గ్రామీణ అభివృద్ధికి దోహదపడుతుందని, LPG వినియోగం తగ్గించడంలో కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు మరో రూ.1 కోటి వ్యయంతో కొత్త ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోపాలపురం నియోజకవర్గంలో గత 22 నెలల్లో రూ.12.64 కోట్ల విలువైన కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల్లో డోర్-టు-డోర్ చెత్త సేకరణను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, అవసరమైన వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు మంజూరు చేస్తామని చెప్పారు. త్వరలో 37 గ్రామపంచాయతీలకు ఎలక్ట్రిక్ వాహనాలు అందజేస్తామని వెల్లడించారు.
ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా గోపాలపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వంతో అభివృద్ధి, సంక్షేమం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బి. అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ కూచిపూడి ఉదయభాస్కరరావు, ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు, గోపాలపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డికర్ల సువర్ణరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



