తాజా వార్తలు

10/recent/ticker-posts

ఆలయ వ్యర్థాలతోనే శక్తి ఉత్పత్తి – ద్వారకాతిరుమలలో గోబర్ధన్ ప్లాంటు ప్రారంభం


ఏలూరు/ద్వారకాతిరుమల, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: పర్యావరణ పరిరక్షణతో పాటు “వేస్ట్ టు వెల్త్” లక్ష్యంతో ద్వారకాతిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన గోబర్ధన్ ప్లాంటును ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సంయుక్తంగా ప్రారంభించారు.


ఈ సందర్భంగా చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ప్లాస్టిక్ రహిత వాతావరణం కల్పించడం, వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆలయాల్లో ఉత్పత్తి అయ్యే సేంద్రియ వ్యర్థాలను బయోగ్యాస్ మరియు సేంద్రియ ఎరువులుగా మార్చడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, శుభ్రమైన శక్తి ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు.

ఈ గోబర్ధన్ ప్లాంటు ద్వారా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పడే ఆర్గానిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసి, బయోగ్యాస్‌తో పాటు ఆర్గానిక్ ఎరువులుగా మారుస్తారని చెప్పారు. దీని వల్ల పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ఇటువంటి గ్రీన్ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.

ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, గోబర్ధన్ ప్లాంటు ద్వారా వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించడం వల్ల శుభ్రత పెరుగుతుందని, పునర్వినియోగ శక్తి ఉత్పత్తికి దోహదపడుతుందని తెలిపారు. గ్రామీణ అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బి. అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ కూచిపూడి ఉదయభాస్కరరావు, అధికారులు ఊర్మిళాదేవి, అర్జునరావు, ఇఇ యం. నారాయణ స్వామి, డిఇఇ కె. సతీష్ కుమార్, ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు, సంయుక్త కమిషనర్, ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, జిల్లా పరిషత్ సీఈఓ పి. జగదాంబ, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి జి. త్రినాధబాబు, గోపాలపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డికర్ల సువర్ణరాజు, వివిధ శాఖల అధికారులు, ఆలయ వేదపండితులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

“భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం మనందరి బాధ్యత” అని నాయకులు పిలుపునిచ్చారు.