కరీంనగర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: వరుసగా చోటుచేసుకుంటున్న మరణాలు గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలకు దారి తీశాయి. గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలల కాలంలో మొత్తం 28 మంది వివిధ కారణాలతో మృతి చెందడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామానికి ఏదో అరిష్టం సోకిందనే అనుమానంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.
వృద్ధులే కాకుండా యువకులు కూడా మరణిస్తుండటంతో గ్రామంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ వరుస మరణాలకు ముగింపు పలకాలని గ్రామ పెద్దలు, పురోహితులను ఆశ్రయించగా, గ్రామ జాతకాన్ని పరిశీలించిన పురోహితుడు ‘కీడు వంటలు’ నిర్వహించాలని సూచించాడు.
దీంతో గురువారం తెల్లవారుజామునే గ్రామస్తులంతా తమ ఇళ్లకు తాళాలు వేసి, పిల్లలతో కలిసి గ్రామ పొలిమేరలకు బయటకు వెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా వంటలు చేసి దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామం పూర్తిగా నిర్మానుష్యంగా మారింది.
అయితే మరోవైపు, ఈ మరణాల వెనుక అసలు కారణాలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కలుషిత నీరు, అంటువ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ఘటనలు జరుగుతున్నాయా అనే దానిపై వైద్య నిపుణులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.
గ్రామంలో తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని, మూఢనమ్మకాలపై కాకుండా వైద్య సేవలపై ఆధారపడేలా అవగాహన కల్పించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.


