తాజా వార్తలు

10/recent/ticker-posts

మాచర్లలో దారుణం.. ప్రభుత్వ ఉద్యోగినిపై లైంగిక దాడి, నిందితుడి కోసం గాలింపు


పల్నాడు జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. మాచర్లలోని 13వ వార్డు రైల్వే స్టేషన్ సమీపంలో ఒంటరిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం, సత్తెనపల్లికి చెందిన మహిళ మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అద్దె ఇంట్లో నివసిస్తోంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇంటి తలుపు తట్టిన అగంతకుడు లోపలికి చొరబడి, కత్తితో బెదిరించి ఆమెను కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన బాలుడు ఆమె పరిస్థితిని గమనించి పొరుగువారికి సమాచారం ఇవ్వడంతో బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని వదిలి పెట్టబోమని హెచ్చరించారు. నిందితుడిని త్వరగా పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.