శ్రీకాకుళం, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: జిల్లాలో ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. సింగుపురం గ్రామంలో బాదం పాలు తాగిన అనంతరం సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వివరాల ప్రకారం, ఈ నెల 1, 2 తేదీల్లో సింగుపురంలో జరిగిన కొండమ్మ తల్లి ఉత్సవాలకు వేలాది మంది హాజరయ్యారు. ఎండ తీవ్రత కారణంగా ఉపశమనం కోసం పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి వ్యాన్‌లో విక్రయించిన బాదం పాలు అనేక మంది కొనుగోలు చేసి తాగారు.
గురువారం అర్ధరాత్రి నుంచి ఒక్కసారిగా కడుపునొప్పి, వాంతులు మొదలవడంతో బాధితులు స్థానిక పీహెచ్సీతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మామిడివలస ప్రాంతానికి చెందినవారిలో సుమారు 25 మంది ఈ ఘటనలో అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బాధితుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, వైద్యులను అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఘటనపై ప్రత్యేక బృందాన్ని నియమించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
_11zon%20(1).jpg)

