ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, అంబేద్కర్ గారు భారతీయ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరని తెలిపారు. సామాజిక సంస్కర్తగా, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. భారత రాజ్యాంగ ప్రధాన శిల్పిగా దేశానికి సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను అందించిన మహానుభావుడని పేర్కొన్నారు.
రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించబడటంతోనే మనమందరం సమానంగా ఎదగగలుగుతున్నామని ఎస్పీ తెలిపారు. కుల, మత భేదాలు లేకుండా సమాజం ముందుకు సాగాలని, “మనుషుల్లో రెండు కులాలే — మంచి, చెడు” అనే భావజాలాన్ని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి ఆలోచనలు నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు.
అంబేద్కర్ గారి జీవిత విశేషాలను వివరించిన ఎస్పీ, ఆయన విద్యా ప్రస్థానం, సామాజిక పోరాటం, రాజ్యాంగ నిర్మాణంలో చేసిన కృషి గురించి వివరించారు. దళితుల అభ్యున్నతికి, మహిళల హక్కుల సాధనకు, సమానత్వ స్థాపనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జీ. మునిరాజా, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఆర్‌ఐ పవన్ కుమార్, ఆర్‌ఎస్‌ఐ భాస్కరరావు, వెంకటేష్ తదితర అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


