తాజా వార్తలు

10/recent/ticker-posts

విజయవాడలో అంబేద్కర్ జయంతోత్సవాలు


విజయవాడ, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: నగరంలోని చలసాని నగర్‌లో భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగర సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు సంగుల పేరయ్య అధ్యక్షతన కార్యక్రమం కొనసాగింది.


ఈ సందర్భంగా మాట్లాడిన దోనేపూడి శంకర్, అంబేద్కర్ గారు చిన్నతనంలో వర్ణ వివక్షను ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలు అనుభవించి ఉన్నత విద్యను సాధించి ప్రపంచ స్థాయి మేధావిగా ఎదిగారని తెలిపారు. ఆయన రాజ్యాంగ రచనలో చూపిన దూరదృష్టి, భారత సమాజంపై ఉన్న లోతైన అవగాహన దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. సమతా ధర్మానికి ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ గారు కులరహిత సమాజ నిర్మాణం కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు.

అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించి సమానత్వం, మానవత్వం అనే విలువలను ప్రపంచానికి చాటి చెప్పారని శంకర్ అన్నారు. దేశంలో కుల, మత వివక్షలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమసమాజ స్థాపనకే ఆయన జీవితం అంకితమైందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, టాక్సీ వర్కర్స్ యూనియన్ సభ్యులు, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు.