ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, జేసీ అభిషేక్ గౌడ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ, దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కల్పించిన హక్కుల ఫలితమేనని గుర్తుచేశారు. విద్య ద్వారానే ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని అంబేద్కర్ జీవితం సాక్ష్యమని పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ, అంబేద్కర్ ప్రపంచ స్థాయి మేధావి అని కొనియాడారు. ఆయన ఒక వర్గానికి మాత్రమే చెందిన నాయకుడు కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరి స్వేచ్ఛ, సమానత్వం కోసం కృషి చేసిన మహానుభావుడని అన్నారు. మహిళలకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డీఆర్ఓ దేవకీదేవి, ఆర్డీఓ కిషోర్, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, సెట్‌వెల్ సీఈఓ ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి, ఎస్డీసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే షెడ్యూల్డ్ కులాల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మహిళలకు రూ.13.64 కోట్ల రుణాలను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, జేసీ అభిషేక్ గౌడలు పంపిణీ చేశారు. ఈ సహాయం మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.


