దెందులూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: గ్రామాల పారిశుధ్యం, ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో మంగళవారం ఆకస్మికంగా పర్యటించిన ఆయన, డ్రైనేజీ పరిస్థితిని పరిశీలించి అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామంలో డ్రైన్లు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడంతో మురుగునీరు రోడ్లపై నిలిచిపోవడం చూసిన ఎమ్మెల్యే వెంటనే అధికారులను అక్కడికి పిలిపించారు. దాదాపు మూడు గంటల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండి జేసీబీ యంత్రాలతో పూడికతీత పనులను పర్యవేక్షించారు. మురుగునీరు సాఫీగా వెళ్లేలా తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే, ప్లాస్టిక్ వ్యర్థాలను డ్రైన్లలో వేయడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. పారిశుధ్య నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏ గ్రామంలో సమస్య ఉన్నా తాను స్వయంగా వచ్చి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాల్లో పారిశుధ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నాగేంద్ర, గ్రామ స్పెషల్ ఆఫీసర్ షరీఫ్, పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


