తాజా వార్తలు

10/recent/ticker-posts

సీసీ రహదారుల పనుల పరిశీలన.. పారదర్శక పాలనతో ప్రజామోదం: ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: జవాబుదారీ పాలనకు పారదర్శక విధానాలు తోడైతేనే ప్రజల పూర్తి మద్దతు లభిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బడేటి చంటి పేర్కొన్నారు. ప్రజాభీష్టాలను నెరవేర్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం జనరంజక పాలనను అమలు చేస్తోందని, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.


ఏలూరు నగరంలోని 4, 5 డివిజన్‌ల పరిధిలో సుమారు రూ.35 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రహదారుల పనులను ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న రోడ్లను, పూర్తయిన పనులను పరిశీలిస్తూ అధికారులకు నాణ్యతపై పలు సూచనలు చేశారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ఆత్మీయ స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాదయాత్ర సమయంలో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని, గతంలో ఉన్న రహదారి సమస్యలను తొలగించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అలాగే జూన్ నెలాఖరులోగా టిడ్కో గృహాలను అర్హులైన లబ్ధిదారులకు కేటాయిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.