భీమడోలు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 11: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న భీమడోలు మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ)పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి. శివకుమార్ డిమాండ్ చేశారు.
శనివారం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యాసంస్థలకు వంటపూట సెలవు ప్రకటించినప్పటికీ, భీమడోలులోని మానస ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యం ఆ నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. విద్యార్థులకు సెలవు ఇవ్వకుండా, వారిపై మానసిక ఒత్తిడి తీసుకువస్తూ వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నారని విమర్శించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ విద్యాసంస్థలు వంటపూట సెలవు ఇస్తున్నప్పటికీ, మానస విద్యాసంస్థ మాత్రం “ర్యాంకులే ముఖ్యమని” భావిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తోందని పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిన భీమడోలు ఎంఈఓ స్పందించకుండా, సంబంధిత విద్యాసంస్థకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యం వహించిన ఎంఈఓపై చర్యలు తీసుకోవడంతో పాటు మానస ప్రైవేటు విద్యాసంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మణికంఠ, హార్దిక్, మురళీకృష్ణ పాల్గొన్నారు.


