భీమడోలు (గుండుగొలను), పశ్చిమ వాహిని, ఏప్రిల్, 11: పి.ఆర్ 126 రకం ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు నాణ్యమైన గోనె సంచులు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
శనివారం భీమడోలు మండలం గుండుగొలను సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజును రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ఎస్. వెంకట్రావు కలిసి రైతుల సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, అధిక దిగుబడులు మరియు లాభదాయకత కారణంగా రైతులు, కౌలు రైతులు పి.ఆర్ 126 రకం వరి పంటను విస్తృతంగా సాగు చేస్తున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం వివిధ కారణాలతో ఈ రకం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో వెనుకంజ వేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ శాఖ ఒక విధంగా, పౌరసరఫరాల శాఖ మరో విధంగా స్పందించడం వల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్‌లో పి.ఆర్ 126 రకం ధాన్యాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, చిరిగిన గోనె సంచుల బదులుగా నాణ్యమైన గోనె సంచులు అందించాలని, ధాన్యం అమ్మకాల సొమ్ముతో పాటు రవాణా ఖర్చులు, హమాలీ చార్జీలు కూడా సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.


