రాజమండ్రి, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: ఇరాన్ దేశానికి చెందిన దౌత్యవేత్త డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ గురువారం రాజమండ్రి నగరానికి విచ్చేసి ఆత్మీయ స్వాగతం పొందారు. నగరంలోని మస్జిద్-ఎ-జహేరా వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్శన రాజమండ్రి నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ‘సురుచి’ ప్రతినిధి వర్మ దౌత్యవేత్తకు జేజేలు పలుకుతూ గౌరవం తెలిపారు. గోదావరి జిల్లాల ఆతిథ్యానికి ప్రతీకగా ప్రసిద్ధ ‘బాహుబలి కాజా’తో పాటు వివిధ రకాల మిఠాయిలను కానుకగా అందించారు. ఆతిథ్యాన్ని డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ ఆనందంగా స్వీకరించారు.
స్థానిక సంస్కృతి, ఆతిథ్య పరంపరను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం సాగింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం కలిగిన ఇరాన్ ప్రతినిధికి రాజమండ్రి ప్రజలు చూపిన ఈ స్నేహపూర్వక స్వాగతం ప్రత్యేకంగా నిలిచింది.



