తాజా వార్తలు

10/recent/ticker-posts

కనసనపల్లిలో కోడి పందాలపై పోలీసుల దాడులు – 14 మంది అరెస్ట్


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 20: జిల్లా ఆగిరిపల్లి మండలంలోని కనసనపల్లి గ్రామ శివార్లలో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆగిరిపల్లి ఎస్ఐ శ్రీ శుభ శేఖర్ గారు తన సిబ్బందితో కలిసి ఈ దాడులు చేపట్టారు. నూజివీడు సబ్‌డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


నూజివీడు డీఎస్పీ శ్రీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ గారు, నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె. రామకృష్ణ గారి ఆదేశాల మేరకు, అందిన గోప్య సమాచారం ఆధారంగా ఈ దాడులు నిర్వహించారు. కనసనపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో కోడి పందాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు పందెం రాయుళ్లను చుట్టుముట్టి పట్టుకున్నారు.

ఈ దాడిలో పందాల్లో పాల్గొన్న 14 మందిని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుండి రూ. 5,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే పందెం స్థలంలో ఉన్న 8 మోటార్ సైకిళ్లు, 10 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ శుభ శేఖర్ గారు మాట్లాడుతూ మండలంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడి పందాలు, పేకాట వంటి జూదాలకు పాల్పడితే కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని సూచించారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.