తాజా వార్తలు

10/recent/ticker-posts

పీఎఫ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం – జిల్లా పరిషత్ సీఈఓ భరోసా


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటీఎఫ్) ఏలూరు జిల్లా నాయకత్వం మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించింది. ఈ సందర్భంగా సీఈఓతో సుదీర్ఘంగా చర్చించిన నాయకులు ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వాటిపై స్పందించిన సీఈఓ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలో కలిసిన నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, ఉంగుటూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి వంటి ఎనిమిది మండలాలకు చెందిన ఉపాధ్యాయుల పీఎఫ్ సొమ్ము జీతాల నుంచి మినహాయింపులు జరిగి ఏలూరు జిల్లా ఖాతాల్లో జమవుతున్నప్పటికీ, వ్యక్తిగత ఖాతాల్లో జమ కాలేదని వివరించారు. ఈ సమస్యపై అనేక సంవత్సరాలుగా ప్రాతినిధ్యాలు చేస్తున్నప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో యుటీఎఫ్ నాయకత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆ ఉత్తర్వుల ప్రకారం 8 మండలాల ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించిన 44 నెలల పీఎఫ్ మొత్తాన్ని వడ్డీతో సహా వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను మే 1 నాటికి పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని యుటీఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ వెంటనే స్పందించి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యుటీఎఫ్ నాయకత్వం ఈ అంశంపై త్వరిత నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ తమ అభ్యర్థనను సమర్పించింది.

ఈ సమావేశంలో యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి, జిల్లా అధ్యక్షులు బి. సుభాషిని, జిల్లా కోశాధికారి జీవీ రంగమోహన్, జిల్లా కార్యదర్శులు ఎన్. రాంబాబు, బి. అనురాధ, కె. కమల్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ షేక్ ముస్తఫా అలీ, జిల్లా మీడియా కన్వీనర్ మహమ్మద్ జిక్రియా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.