తాజా వార్తలు

10/recent/ticker-posts

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన ఎస్సీ మోర్చా నాయకుడు


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 20: జిల్లాలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ విమర్శలు ముదిరాయి. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే బిల్లును ఆమోదం పొందనీయకుండా అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల ఉన్న వైఖరిని స్పష్టంగా చూపుతుందని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి విమర్శించారు. మహిళల సాధికారతకు ఇది కీలకమైన చట్టమని ఆయన పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లుకు అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరమన్నారు. మహిళలు విద్యావంతులైతే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని, అదే విధంగా రాజకీయాల్లో కూడా మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు అవకాశాలు పెరగడం ద్వారా సమతుల్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నారని, రాబోయే రోజుల్లో ఈ బిల్లుకు చట్టబద్ధత తప్పక లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళల హక్కుల పరిరక్షణలో ఈ బిల్లు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

అలాగే ప్రజలు రాజకీయ పార్టీల వైఖరిని గమనించాలని, మహిళల సాధికారతకు మద్దతు ఇచ్చే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మహిళలు రాజకీయాల్లో మరింతగా ముందుకు రావాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.