ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 20: జిల్లాలో విద్యా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ “బడి పిలుస్తోంది” కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె “బడి పిలుస్తోంది” గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ప్రక్రియను ఏప్రిల్ 17 నుండి ప్రారంభించి మంచి ఫలితాలు సాధించాలన్నారు.
ప్రభుత్వ, ఎంపీపీ, జిల్లా పరిషత్తు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులను చేర్చడం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అయిదేళ్లు నిండిన పిల్లలు, 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు 6వ తరగతిలో చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. మురికివాడల్లో నివసించే పిల్లలు, బడిమానేసిన వారు, బడికి వెళ్లని చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న సదుపాయాలపై తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టరు పేర్కొన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫారాలు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, నాణ్యమైన బోధన, ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రయోజనాలను వివరించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులను కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, ఇంచార్జి ఆర్డీవో ఐ.కిషోర్, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ డా.కె. పంకజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



