టి.నర్సాపురం, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా టి.నర్సాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలవరం డీఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా టి.నర్సాపురం ఎస్ఐ జయబాబు మాట్లాడుతూ జయంతి వేడుకలను క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని విగ్రహ కమిటీ సభ్యులు, యువతకు సూచించారు. ప్రతి విగ్రహం వద్ద తగినంత లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
విగ్రహాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఉత్సవాల పేరుతో ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సహించబోమని హెచ్చరించారు. బైక్ సైలెన్సర్లు తొలగించి రేసింగ్‌లు చేయడం, అతివేగంగా నడపడం వంటి చర్యలపై వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదర్శవంతంగా జరుపుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విగ్రహ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


