ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: జిల్లాలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని “సేఫ్ క్యాంపస్ జోన్” ఆపరేషన్‌ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ డిపార్ట్మెంట్ మరియు పోలీసులు సంయుక్తంగా పాన్ షాపులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల సందర్భంగా షాప్ యజమానులకు COTPA చట్టం నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలకు 100 యార్డుల పరిధిలో టొబాకో ఉత్పత్తుల విక్రయం పూర్తిగా నిషేధించబడినదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు విద్యార్థులను మాదకద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తుల నుంచి దూరంగా ఉంచడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇలాంటి తనిఖీలు తరచుగా కొనసాగుతాయని వెల్లడించారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఎవరైనా గమనించినట్లయితే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు వన్ టౌన్ ఎస్ఐ వై. సుధాకర్, ఈగల్ డిపార్ట్మెంట్ ఆర్ఎస్ఐ బి. ఉదయభాస్కర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


