కైకలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: కైకలూరు సర్కిల్ కార్యాలయంలో మండవల్లి, కైకలూరు రూరల్ మండలాలకు చెందిన గ్రామాల విగ్రహ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రాబోయే బాబు జగజ్జీవన్ రామ్ జయంతి మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను పోలీసులు వివరించారు.
ఈ సందర్భంగా గ్రామాలలో ఉన్న విగ్రహాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ర్యాలీలు నిర్వహించే సమయంలో ఎవరినీ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదని హెచ్చరించారు. ర్యాలీలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే ఉత్సవాల సమయంలో ఎటువంటి గొడవలు లేదా అల్లర్లు జరిగితే సంబంధిత విగ్రహ కమిటీ సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో బాణసంచా వినియోగం పూర్తిగా నిషేధించబడిందని తెలిపారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించడం ద్వారా మహనీయులకు నిజమైన గౌరవం చూపించాలని, అందరూ పోలీసులకు సహకరించాలని కైకలూరు రూరల్ సీఐ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండవల్లి ఎస్ఐ రామచంద్ర, కైకలూరు రూరల్ ఎస్ఐ రాంబాబు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


