ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగం గత 75 సంవత్సరాలుగా దేశ ప్రజలకు రక్షణగా నిలుస్తోందని, అలాంటి రాజ్యాంగానికి నష్టం చేకూర్చే విధంగా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ఆరోపించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయం ‘స్ఫూర్తి భవన్’లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చైతన్య, స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని కులాలు, జాతుల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు, అణగారిన వర్గాల అభివృద్ధికి దోహదపడేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. అయితే, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని బలహీనపరచి, మనువాద సిద్ధాంతాలకు అనుగుణంగా మార్పులు చేయాలనే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ రాజ్యాంగ ఫలాలు పూర్తిగా అణగారిన వర్గాలకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న ఈ సమయంలో దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందన్నారు.
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, న్యాయం ప్రజలకు చేరేలా అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా యువత, విద్యార్థులపై ఉందని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు, సిపిఐ కార్యకర్తలు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


