తాజా వార్తలు

10/recent/ticker-posts

మహోన్నత వ్యక్తి డా. బి.ఆర్ అంబేద్కర్ – ఆశయ సాధనకు కృషి చేయాలి


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహోన్నత వ్యక్తి అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ది ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆటోనగర్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేద్కర్ చిన్ననాటి నుంచే ఎదుర్కొన్న కుల వివక్ష, అస్పృశ్యత, అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహానుభావుడని కొనియాడారు. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించి ప్రపంచ మేధావిగా ఎదిగారని తెలిపారు. కేవలం ఒక వర్గానికే కాకుండా దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప నాయకుడని అన్నారు.

అసోసియేషన్ కార్యదర్శి అడపా సత్యనారాయణ, సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిందని, ఆయన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సభ్యులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ జుల్ఫీ, మంతెన వెంకటేశ్వరరావు, పర్వేజ్, షఫీ, కాలేషా, కాశి, బాబురావు, శాయన అభిలాష్ కుమార్, కురెళ్ళ వరప్రసాద్, ఎలక్ట్రిషన్ సాంబ తదితరులు పాల్గొన్నారు.