మంచిర్యాల, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 15: కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాలలోని తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో విదేశీ ఉద్యోగావకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా జర్మనీ వంటి దేశాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉన్నాయని, తెలంగాణ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
జర్మనీలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల ఉద్యోగాల అవసరం ఉందని, అందుకు అనుగుణంగా ప్రతి ఏడాది 90 వేల వీసాలు జారీ చేసేందుకు ఆ దేశం ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏటీసీల ద్వారా సుమారు 25 వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం సుమారు ₹4,000 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టాంకామ్ ద్వారా నాలుగు నెలల్లోనే జర్మన్ భాష శిక్షణ అందిస్తామని, ప్రైవేటు ఏజెన్సీల మోసాలకు గురికాకుండా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విదేశాల్లో భారతీయులకు మంచి పేరు ఉందని, అక్కడి చట్టాలను గౌరవిస్తూ కష్టపడి పనిచేస్తారని గుర్తుచేశారు. సరైన నైపుణ్యాలు ఉంటే నెలకు ₹2 లక్షలకు పైగా వేతనాలు పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ప్రభుత్వానికి చెందుతుందని పేర్కొన్నారు. స్థానిక నిరుద్యోగ యువత టాంకామ్ అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
అదనంగా, తెలంగాణ గిగ్ వర్కర్స్ యాక్ట్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు.


