తాజా వార్తలు

10/recent/ticker-posts

భీమడోలు పాతూరులో పోలీసుల అవగాహన సదస్సు – సీసీ కెమెరాల ప్రారంభం


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 05: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సాంకేతికతను వినియోగించుకోవాలని, ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. కృష్ణ తెలిపారు. భీమడోలు మండలం పాతూరు గ్రామంలో ఎస్‌ఐ షేక్ మదీనా బాషా మరియు పోలీసు సిబ్బందితో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు.


ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సి.ఐ. పి. కృష్ణ, ఎస్‌ఐ మదీనా బాషా ప్రారంభించారు. గ్రామాల్లో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు మూడవ కన్నులా పనిచేస్తాయని, వీటి ఏర్పాటు చేసిన గ్రామస్తులను అభినందించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆన్‌లైన్ మోసాలపై జాగ్రత్తలు సూచించారు. తెలియని వ్యక్తులకు OTPలు చెప్పవద్దని, మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారం పంచుకోవడంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అలాంటి ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన కల్పిస్తూ బాధితులకు లభించే రక్షణలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, వృద్ధులు, చిన్నారులు 112 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

రోడ్డు భద్రతపై కూడా అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను హెచ్చరించారు. వేసవి కాలంలో పిల్లల భద్రతపై ప్రత్యేక సూచనలు చేస్తూ చెరువులు, కాలువలు, నదుల వద్దకు వెళ్లకుండా పర్యవేక్షించాలని, ఎండ తీవ్రత సమయంలో బయటకు పంపకూడదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాతూరు గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు భీమడోలు పోలీస్ స్టేషన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.