ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 05: జిల్లా జంగారెడ్డిగూడెంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం మేనేజర్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు జీవితంలో సినీ, రాజకీయ అభిమానానికి ప్రత్యేక స్థానం ఉంది. చిన్నప్పటి నుంచే ఎన్. టి. రామారావు గారి వీరాభిమానిగా ఉన్న ఆయన, 1982లో టీడీపీ స్థాపన తరువాత పార్టీతో అనుబంధాన్ని మరింత బలపరుచుకున్నారు.
ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ పట్ల అపారమైన అభిమానంతో “యువరత్న బాలకృష్ణ ఫ్రెండ్స్ యూనిట్” అనే అభిమాన సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సినీ రంగం, రాజకీయ రంగాల్లో బాలకృష్ణ ఎదుగుదలను ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు.
1990 నవంబర్ 4న తనకు మొదటి కుమారుడు జన్మించగా, అదే నెలలో విడుదలైన లారీ డ్రైవర్ సినిమా విజయంతో ప్రేరణ పొంది, ఆ సినిమా పోస్టర్ పెట్టి తన కుమారుడికి అన్నప్రాసన నిర్వహించినట్లు గుర్తుచేశారు. అనంతరం తన పెద్ద కుమారుడికి “బాలకృష్ణ” అని నామకరణం చేయడం తన అభిమానానికి నిదర్శనమని చెప్పారు.
తరువాత జన్మించిన చిన్న కుమారుడికి “హరికృష్ణ” అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఒక సందర్భంలో భువనేశ్వరి నందమూరి గారికి ఈ విషయం చెప్పగా, “ఆడపిల్లల పేర్లు పెట్టలేదా?” అని అడిగారని, తమకు ఆడపిల్లలు లేరని ఉంటే తప్పకుండా ఆ పేర్లు పెట్టేవాడినని సమాధానమిచ్చినట్లు వివరించారు.
ప్రస్తుతం ఆయన కుటుంబం మొత్తం టీడీపీకి మద్దతుదారులుగా కొనసాగుతుండగా, పెద్ద కుమారుడు బాలకృష్ణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే ఎన్బీకే అభిమానిగా ఉన్నాడని తెలిపారు. అభిమానంతో ప్రారంభమైన ఈ అనుబంధం ఇప్పటికీ అదే ఉత్సాహంతో కొనసాగుతుండటం విశేషం.
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా నేడు ఆయనను స్మరించుకుంటూ ఈ విషయాన్ని తెలిపారు. తమ అభిమాన నాయకుడు ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు.






