ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 05: జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా సైబర్ సెల్ పోలీసులు వినూత్న సేవతో ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, నేరుగా బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి అందజేస్తూ పోలీసింగ్‌లో కొత్త దిశను చూపించారు.
జిల్లా సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ దాసు నేతృత్వంలో ప్రత్యేక బృందం పనిచేసి, ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ల పరిధిలో నమోదైన ఫిర్యాదులను సమీక్షించింది. ఆధునిక మొబైల్ ట్రాకింగ్ సాంకేతికతను వినియోగించి తక్కువ సమయంలోనే మొత్తం 697 మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
రికవరీ చేసిన ఫోన్లను బాధితులు పోలీస్ స్టేషన్లకు వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, పోలీసు సిబ్బందే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందజేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేకతగా నిలిచింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, సమయాన్ని ఆదా చేయడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
సైబర్ సెల్ విభాగం ఆధునిక సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో ఫోన్లను సమర్థవంతంగా ట్రాక్ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచింది. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి వస్తాయని ఆశ వదిలేసుకున్న బాధితులు, పోలీసులు ఇంటికే వచ్చి ఫోన్లను అందజేయడంతో ఆనందం వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే తమ వస్తువులు తిరిగి దక్కడం పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందని బాధితులు తెలిపారు. జిల్లా ఎస్పీ నాయకత్వంలో పోలీసులు అందిస్తున్న ఈ సేవలకు ప్రజల నుండి విశేష ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


