తాజా వార్తలు

10/recent/ticker-posts

కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభం – పేదలకు పట్టెడన్నమే లక్ష్యం: ఎమ్మెల్యే బండారు


కొత్తపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 15: పేదవారికి పట్టెడన్నం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పమని బండారు సత్యానందరావు పేర్కొన్నారు. బుధవారం కొత్తపేటలో నిర్వహించిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని క్యాంటీన్‌ను ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి, వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి మంగాదేవి భీమారావు, వైస్ చైర్మన్ కంఠంశెట్టి శ్రీనివాసరావు, బండారు కృష్ణ సందీప్, మండల పార్టీ అధ్యక్షులు గనిశెట్టి వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభానికి ముందు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల కనీస అవసరాలైన ఆహారం, బట్ట, నివాసం అందించాలనే లక్ష్యంతోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని తెలిపారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తిరిగి ప్రారంభమైన ఈ క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా పేదల ఆకలి తీర్చుతున్నాయని చెప్పారు.

అన్నా క్యాంటీన్లలో కేవలం రూ.5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు సాయంత్రం భోజనం అందిస్తున్నామని, రోజుకు లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు కోట్ల సంఖ్యలో భోజనాలు అందించామని వెల్లడించారు.

2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్యాంటీన్లను నిలిపివేసిందని విమర్శించిన ఆయన, తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించామని పేర్కొన్నారు.

కొత్తపేటలో ప్రారంభించిన ఈ క్యాంటీన్ ద్వారా రోజుకు సుమారు 400 మందికి భోజనం అందిస్తున్నామని, త్వరలోనే రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.

అదేవిధంగా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి సందర్భాల్లో ప్రజలు క్యాంటీన్‌లో భోజనం స్పాన్సర్ చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో భాగంగా యువ నాయకుడు బండారు శ్రీకృష్ణ సందీప్ తన పుట్టినరోజు సందర్భంగా భోజనాన్ని స్పాన్సర్ చేయగా, ఎమ్మెల్యే ఆయనను అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా పేదలకు భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.