జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పామాయిల్ లోడుతో వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే, కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామానికి చెందిన చల్ల మౌళి (17) గురువాయిగూడెం మద్ది దేవాలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం నుంచి ఆడమిల్లి వైపు వెళ్తుండగా పుట్లగట్లగూడెం వద్ద ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో మౌళి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి తండ్రి లేకపోవడంతో నాయనమ్మ భగవతి వద్ద పెరిగినట్లు బంధువులు తెలిపారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న అతని ఆకస్మిక మరణంతో కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. గ్రామస్తులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను సవ్యంగా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


