ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పిట్టా వరప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబి, రాష్ట్ర సభ్యుడు అర్జా రవికుమార్ తదితరులు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐజీని కోరారు. ఏలూరు రేంజ్ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న పలు అంశాలను కూడా ప్రతినిధులు ప్రస్తావించారు.
సమావేశంలో ఐజీ అశోక్ కుమార్ ప్రతి అంశంపై వివరాలు తెలుసుకుని స్పందించారు. అనంతబాబు కేసులో సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఇప్పటికే శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అనంతబాబు అరెస్టై రిమాండ్‌లో ఉండటంతో బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అదే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్‌పీఐ నేతలు విజ్ఞప్తి చేయగా, ఈ విషయంపై కూడా సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని ఐజీ హామీ ఇచ్చారు.


