భీమడోలు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: గ్రంథాలయాలు విజ్ఞాన సముపార్జనకు ప్రధాన కేంద్రాలని భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి పేర్కొన్నారు. భీమడోలు శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శిబిరాలను రాష్ట్ర డైరెక్టర్ కర్ణం పెద్దిరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరావు అధ్యక్షత వహించగా, ఎంఈఓ-2 భాస్కర్ కుమార్, రాష్ట్ర డైరెక్టర్లు కర్ణం పెద్దిరాజు, దూషణపూడి పుల్లయ్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ టీవీ, సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉండి మానసిక వికాసానికి దోహదపడే పుస్తకాలను చదవాలని సూచించారు.
ప్రభుత్వం చేపట్టిన వేసవి శిక్షణా కార్యక్రమాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయాలని కోరారు. “చదువుదాం – ఎదుగుదాం – గొప్పవాళ్లం అవుదాం” అనే లక్ష్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గ్రంథాలయాలను చిన్న వయసు నుంచే వినియోగించుకుంటే జీవితంలో విజయాలు సాధించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిన్నారులు పద్యాలు పఠిస్తూ ఆకట్టుకున్నారు. అనంతరం “సెల్‌ఫోన్ వద్దు – పుస్తకమే ముద్దు” అనే నినాదంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి శిక్షణా కార్యక్రమాలకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కాపాక సతీష్, ఉపాధ్యక్షుడు పైడిమాల యుగంధర్, పెద్దలు కమ్మ పద్మ, ఆదిరెడ్డి సత్యనారాయణ, తాటిమల్ల రామ్మూర్తి, అజయ్ చిన్నబాబు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్, పాఠశాల కరస్పాండెంట్ యలమర్తి రవీంద్ర కుమార్, పివివి సత్యనారాయణతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


