తాజా వార్తలు

10/recent/ticker-posts

“ఒక విగ్రహం… కానీ వెనుక ఉన్న సందేశం ఏమిటి?”


అమలాపురం రూరల్, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 10: అమలాపురం రూరల్ మండలం ఏ. వేమవరప్పాడులో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంబేద్కర్ మనవడు యశ్వంతరావు అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, ప్రజలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. అంబేద్కర్ మరియు రమాబాయి అంబేద్కర్ చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి దళిత స్త్రీ, పురుషుడు ఆయన సిద్ధాంతాలను ఆచరిస్తేనే నిజమైన అంబేద్కరిజం సాధ్యమవుతుందని అన్నారు.

అభివృద్ధి చెందిన వారు వెనుకబడిన వారికి తోడ్పాటు అందించడం ద్వారానే సమాజంలో సమానత్వం నెలకొంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే పొదుపు అలవాటు అత్యవసరమని సూచించారు. రూపాయి రూపాయి దాచుకుంటూ ముందుకు వెళితేనే భవిష్యత్తులో స్థిరత్వం సాధ్యమవుతుందని వివరించారు.

యువతపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆయన, సమయాన్ని వృథా చేయకుండా ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వ్యాపారం, వ్యవసాయం లేదా ఉద్యోగంలో స్థిరపడుతూ స్వయం సమృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు. అలాగే మద్యపాన వ్యసనాలకు దూరంగా ఉండి, విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు.