తాజా వార్తలు

10/recent/ticker-posts

ఇంటిమీదే విద్యుత్ ఉత్పత్తి… పైగా ఆదాయం కూడా! ఈ పథకం నిజంగానే వరమా?


కొత్తపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 10: ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు “పీఎం సూర్య ఘర్” పథకం వరంలాంటిదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉందన్నారు.


బిళ్ళకుర్రు సబ్‌స్టేషన్ వద్ద రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసిన 11 కెవి ట్రాన్స్ఫార్మర్లు, 11 కెవి బ్రేకర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సదుపాయంతో మోడేకుర్రు, గొలకోటివారిపాలెం గ్రామాలకు 24 గంటల త్రీ-ఫేస్ విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది. అనంతరం కొత్తపేట గోగువారి పేటలో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను కూడా ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు ఈ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 2 కిలోవాట్ల సౌర యూనిట్‌ను పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేస్తూ, సుమారు రూ.1.50 లక్షల వ్యయం భరిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సౌర యూనిట్ ద్వారా నెలకు సుమారు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, అవసరానికి మించి మిగిలిన విద్యుత్‌ను విక్రయించి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. అంతేకాకుండా లబ్ధిదారులకు నెలకు రూ.200 అద్దె కూడా లభిస్తుందని తెలిపారు. ఇలా ఉచిత విద్యుత్‌తో పాటు ఆదాయం పొందే అరుదైన అవకాశం ఇది అని అన్నారు.

కొత్తపేట నియోజకవర్గంలో 12,243 మంది అర్హులను గుర్తించగా, ఇప్పటివరకు 3,278 మంది ముందుకు వచ్చారని చెప్పారు. వీరిలో ఎక్కువ మంది ఎస్సీ వర్గానికి చెందినవారేనని తెలిపారు. ఇంకా అవగాహన లోపంతో కొందరు ఈ పథకానికి దూరంగా ఉన్నారని, అందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సూచించారు.

ఇతర వర్గాలకు చెందిన వారు 3 కిలోవాట్ల సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే రూ.78,000 సబ్సిడీతో పాటు రూ.1.20 లక్షల వరకు బ్యాంకు రుణ సదుపాయం ఉంటుందని వెల్లడించారు. సౌర విద్యుత్ వినియోగం పెంచడం ద్వారా పర్యావరణానికి మేలు చేస్తూ, ఆర్థికంగా బలపడే దిశగా ముందడుగు వేయాలని ఎమ్మెల్యే సూచించారు.