ఏలూరు/కైకలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: ప్రాంతాల్లో పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యుడు వి. గాంధీబాబు పేర్కొన్నారు. మంగళవారం కైకలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రం, కొల్లేటికోట ప్రాంతాల్లోని చేపల చెరువుల వద్ద నివసిస్తున్న కుటుంబాలను ఆయన సందర్శించి పిల్లల పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు అవసరమైన సూచనలు, దిశానిర్దేశం చేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలపై లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించామని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలు మరింత అంకిత భావంతో అమలు కావాలని, ఎక్కడైనా చిన్నపాటి ఫిర్యాదు వచ్చినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న అత్యవసర వైద్య సేవలు, నవజాత శిశు సంరక్షణ సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వైద్య సిబ్బంది స్నేహపూర్వక వైఖరితో ఉంటే ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని సూచించారు.
పందిరిపల్లగూడెం ప్రాంతంలో మత్స్యకారులు, వడ్డెర సంఘాల కుటుంబాలను సందర్శించి, 18 సంవత్సరాల లోపు పిల్లల వివరాలు సేకరించినట్లు తెలిపారు. ప్రతి బడి ఈడు పిల్లవాడు తప్పనిసరిగా పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, నూరుశాతం చేరికలు లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. చదువు మాన్పించి వలస కార్మికులుగా మార్చకూడదని సంఘ పెద్దలకు అవగాహన కల్పించగా, వారు సానుకూలంగా స్పందించి పిల్లలందరినీ చదివించేందుకు అంగీకరించినట్లు చెప్పారు.
వలస వెళ్లే కుటుంబాల పిల్లల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న హాస్టల్ సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. ఆ పిల్లలను హాస్టళ్లలో చేర్చి వారి విద్య నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పిల్లల హక్కుల పరిరక్షణలో సమాజం మొత్తం భాగస్వామ్యం అయినప్పుడే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖాధికారి పి. శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సి.హెచ్. సూర్యచక్రవేణి, వైద్యాధికారులు, ఐసిడిఎస్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


