తాజా వార్తలు

10/recent/ticker-posts

మైనర్ బాలికపై అత్యాచారం.. పాస్టర్ అరెస్ట్


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 10: మైనర్ బాలికపై మాయమాటలతో పలుమార్లు అత్యాచారానికి పాల్పడి బెదిరింపులకు దిగిన ఓ పాస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కు చెందిన జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


పోలీసుల వివరాల ప్రకారం, కళ్లచెరువు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ‘ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం’ నిర్వహిస్తున్న చవటపల్లి రాంబాబు అలియాస్ హోసన్నా (40) అనే వ్యక్తి అదే కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికపై ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బలవంతంగా లైంగిక దాడి చేసి, ఈ విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పలుమార్లు బాలికపై దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తడికలపూడి మహిళా ఎస్సై కుమారి ఎస్. వల్లీ పద్మ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాధన్ స్వయంగా దర్యాప్తు చేపట్టి నిందితుడి ప్రమేయాన్ని నిర్ధారించారు.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం నిందితుడు చవటపల్లి రాంబాబు @ హోసన్నాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై POCSO Act తో పాటు ఇతర కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ సుస్మిత రామనాధన్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాజంలో నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ నేరాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.