ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: జిల్లాలో వైద్యసేవలు, వ్యవసాయ అనుబంధ శాఖలు మరియు ఇతర ప్రజోపకార కార్యక్రమాలకు ఇంధన కొరతలేదని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ శాఖలు వారీగా అవసరమైన ఇంధన ఇండెంట్లు ముందుగానే సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు అందుతున్న సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు కూడా ఎటువంటి ఇంధన కొరతలేదని కలెక్టర్ తెలిపారు. ఏలూరు, నూజివీడు డిపోల్లో బంకులు ఉండి, నాలుగు రోజులపాటు సరిపడా నిల్వలు ఉన్నాయని, అవసరమైన మేరకు మరిన్ని ఇండెంట్లు ఇప్పటికే పెట్టామని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయం, వైద్య సేవలు, అత్యవసర సేవల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిరంతరాయంగా ఇంధన సరఫరా కొనసాగుతోందని వివరించారు.
ప్రజలు అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని కలెక్టర్ హెచ్చరించారు. ఇలా నిల్వలు పెంచడం వల్ల రోజువారీ వినియోగదారులకు కొరత ఏర్పడే అవకాశముందని, వేసవి కాలంలో ప్రమాదాలకూ దారితీస్తుందని చెప్పారు. ప్రజలు, రైతులు అపోహలకు లోనుకాకుండా ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం ఉంచాలని కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని, జనరేటర్లు, అంబులెన్సులకు డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో విద్యుత్ సిబ్బంది ఉండేలా చూడాలని సూచించారు. రైతులకు కూడా డీజిల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇంధన పంపిణీలో పారదర్శకత కోసం శాఖల వారీగా కూపన్లు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ టోకెన్లు జారీ చేస్తే బాధ్యులపై ఛార్జ్ మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. పెట్రోల్ బంకుల్లో నిల్వలను నిరంతరం పరిశీలిస్తూ అవసరానికి తగ్గట్టు ఆయిల్ కంపెనీలకు ఇండెంట్లు పెట్టాలని, టోకెన్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


