తాజా వార్తలు

10/recent/ticker-posts

డీజిల్ సరఫరాపై కఠిన చర్యలు.. బంక్‌ల వద్ద పర్యవేక్షణ పెంపు


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: జిల్లాలో డీజిల్ సరఫరా సమస్యపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కీలక ఆదేశాలు జారీ చేశారు. బంక్‌ల వద్ద డీజిల్ పక్కదారి పట్టకుండా సిబ్బందిని నియమించి సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అధికారులు, తహశీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.


కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ కంపెనీల నుంచి ట్యాంకర్లు ఇండెంట్ పెట్టిన బంక్‌లకు చేరుతున్నాయని తెలిపారు. ప్రతి బంక్ వద్ద సిబ్బందిని నియమించి నిల్వలు పరిశీలించడంతో పాటు రికార్డులు, విక్రయాలపై నిశితంగా తనిఖీలు చేయాలని సూచించారు. డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడం, అధిక ధరలకు అమ్మడం వంటి అక్రమాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

జిల్లాలో గత వారం సాధారణ వినియోగం కంటే 200 శాతం అధికంగా డీజిల్ అందుబాటులో ఉంచినప్పటికీ సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతూ పానిక్ కొనుగోళ్లు చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు సరిపడా డీజిల్ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేస్తూ, అపోహలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయ అవసరాల దృష్ట్యా వరి కోత యంత్రాలకు టోకెన్ విధానం అమలు చేయాలని సూచించారు. రైతులు ఏ రోజు యంత్రాలను వినియోగిస్తారో అదే రోజుకు డీజిల్ అందేలా టోకెన్లు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ఆక్వా రైతులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా డీజిల్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

డీజిల్ కొరతపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు కంట్రోల్ రూమ్ నంబర్ 7569296272 అందుబాటులో ఉంచామని, ఈ విషయంపై ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు మరియు తహశీల్దార్లు పాల్గొన్నారు.