తాజా వార్తలు

10/recent/ticker-posts

మహిళల భద్రతపై గ్రామస్థులకు అవగాహన.. పోక్సో, క్రిమినల్ చట్టాలపై వివరణ


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో వడ్లమాను గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో ఆగిరిపల్లి ఎస్‌ఐ శుభ శేఖర్ పోలీసు సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా మహిళలపై జరిగే నేరాల నివారణ, భద్రతకు సంబంధించిన చట్టాలపై గ్రామస్తులకు వివరించారు. మహిళలు, బాలికలపై వేధింపులు, దాడులు, అలాగే బాలలపై లైంగిక నేరాల సందర్భాల్లో అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలు, ఫిర్యాదు విధానం, పోలీసుల సహకారం గురించి స్పష్టంగా తెలియజేశారు.

పోక్సో చట్టం ద్వారా చిన్నారుల రక్షణకు ఉన్న నిబంధనలను ప్రజలకు వివరించి, బాలలపై జరిగే నేరాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు. చిన్నారుల భద్రత కుటుంబంతో పాటు సమాజం మొత్తం బాధ్యత అని గుర్తు చేశారు.

అదేవిధంగా నూతన క్రిమినల్ చట్టాల్లో వచ్చిన మార్పులు, వాటి అమలు విధానం, ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు చురుకుగా పాల్గొని చట్టాలపై, భద్రతా చర్యలపై అవగాహన పొందారు. పోలీసులు మరియు ప్రజలు కలిసి పనిచేస్తేనే నేరాల నివారణ సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.