తాజా వార్తలు

10/recent/ticker-posts

మహిళల భద్రతకు శక్తి యాప్ వినియోగించండి: ముసునూరు ఎస్సై చిరంజీవి సూచన


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో ముసునూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో ముసునూరు ఎస్సై ఎం. చిరంజీవి మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు.


శక్తి యాప్ అనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం మహిళల రక్షణ కోసం రూపొందించిన ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ అని ఎస్సై తెలిపారు. ఆపదలో ఉన్నప్పుడు యాప్‌లోని SOS బటన్ నొక్కితే ఫోన్ కాల్ చేయకుండానే వినియోగదారుడి లొకేషన్ వివరాలు సమీప పోలీస్ కంట్రోల్ రూమ్‌కు, అలాగే కుటుంబ సభ్యులకు చేరుతాయని చెప్పారు. ఇది మహిళలకు తక్షణ రక్షణ అందించే డిజిటల్ కవచంలా పనిచేస్తుందని వివరించారు.

ప్రయాణ సమయంలో ఈ యాప్ ద్వారా కదలికలను కుటుంబ సభ్యులు, పోలీసులు గమనించగలరని, దీనివల్ల భద్రత మరింత పెరుగుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో SOS బటన్ నొక్కిన వెంటనే పరిసరాల్లోని శబ్దాలు, దృశ్యాలు ఆటోమేటిక్‌గా రికార్డ్ అయి పోలీసులకు చేరుతాయని, ఇది నేరస్థులను పట్టుకోవడంలో కీలక సాక్ష్యంగా ఉపయోగపడుతుందని చెప్పారు.

ఇంటర్నెట్ లేకపోయినా SMS ద్వారా సమాచారం పంపే సౌకర్యం కూడా ఈ యాప్‌లో ఉందని పేర్కొన్నారు. అలాగే సమీప పోలీస్ స్టేషన్ వివరాలు సులభంగా తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. బాలికలపై వేధింపులు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.

మహిళలు తమ హక్కులను తెలుసుకొని ధైర్యంగా ముందుకు రావాలని, ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలని ఎస్సై సూచించారు. ప్రతి మహిళ తమ స్మార్ట్‌ఫోన్‌లో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు కాల్ చేయాలని, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

శక్తి యాప్‌ను రక్షణ ఆయుధంగా వినియోగించి భయంలేని సమాజాన్ని నిర్మించుకోవాలని, ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ ప్రాధాన్యత అని ఎస్సై ఎం. చిరంజీవి పేర్కొన్నారు.