తాజా వార్తలు

10/recent/ticker-posts

పోలవరం పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 29: పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పునరావాసం, భూసేకరణ, నిర్మాణ పనులపై ఆమె సమీక్షించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే పూర్తి దశలో ఉన్న ఇళ్లను తక్షణమే పూర్తి చేసి, నిర్వాసిత కుటుంబాలను కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి కాలం నిర్మాణాలకు అనుకూలంగా ఉండటంతో పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇప్పటికే పూర్తైన ఇళ్లలో ఎలాంటి మరమ్మత్తులు అవసరమైతే వాటిని వెంటనే చేపట్టి, నివాసయోగ్యంగా మార్చాలని పేర్కొన్నారు. నిర్వాసితులకు భూమికి భూమి పరిహారం అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైన భూముల సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

భూసేకరణలో భాగంగా సంబంధిత గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పీసా కమిటీల అనుమతి తప్పనిసరిగా పొందాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా నూజివీడు ఔటర్ రింగ్ రోడ్‌కు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కూడా ఆదేశించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, ఐటిడిఏ పీఓ రాములు నాయక్, ఆర్డీఓ రమణ, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.